Monday 2 July 2012

బాబా నిను ఒక్కసారి.....



నిన్న సాయి సత్సంగం తరపున  రెండు సంవత్సరములు క్రితం జరిగిన ఒకానొక అద్భుత సంఘటన పురస్కరించుకుని మా ఇంట భజన కార్యక్రమం నిర్వహించాము. ప్రతిసారి మేము మాకు వీలయినంతవరకూ, మా ఆర్ధిక  స్థితిగతుల ననుసరించి నిరాడంబరముగా భజన కార్యక్రమములు నిర్వహిస్తాము. అలాగే ఈసారి జరిగిన భజనకి ఒక మా కుటుంబ సభ్యులు కాక మరో 10 కుటుంబాలని పిలిచాము. మా ఇంట భజన అంటే అత్యంత ఉత్సాహంతో భజన సమయానికి ముందే అందరూ చేరుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ అధిక ప్రసంగాలు, అనవసర కాలాయాపనలు ఉండవని భక్తులందరికి తెలుసు. పూజ సమయానికి చేరుకుని భజన అంతా కనులవిందుగా వీక్షించి ప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. మేము ఎవరినన్నా మర్చిపోతే, "మీరు పిలవకపోయినా మేము వస్తాము " అనేంత అమితమైన అభిమానం మా ఇంటికి వచ్చే సాయి భక్తులకి.

అలాగే నిన్నటి భజనకి సాయి భక్తులు ఎంతో లీనమై భజన చేశారు. అలాంటి సమయంలో బృంధ సభ్యులొకరు పాడిన పాటకి ఆ సభ్యుడు మరియు భజన కావిస్తున్న భక్తులు ఒకవిధమైన ట్రాన్స్ లోకి వెళ్ళి కళ్ళనుండి నీళ్ళతో ఎదురుగా బాబా కూర్చుంటే తమ బాధలు విన్నవిస్తున్నారన్నంతగా   భక్తిలో లీనమయ్యారు , ఎవరో ఒకరిద్దరు అత్యుత్సాహం , అధిక ప్రసంగము కావిస్తూ బాహ్య పటాటోపాలు చూపించారు తప్ప .. ప్రతి ఒక్కరూ చిన్నా పెద్దా ఆ భక్తి రసంలో మునిగి తేలియాడారు.. ఆనందం పట్టలేక మరొక్కసారి ఆ పాటని వినిపించమని భజన బృందానికి వేడుకున్నారు. 


ఆ భజనకి సంబంధించి వైబ్రేషన్స్ అలా ప్రతిఒక్కరిని ఈరోజు ఉదయం కూడా వెంటాడుతుండగా భజన బృందం సభ్యుడు ఈరోజు మాకు ఫోన్ చేసి,  ఈ మధ్య కాలంలో ఇంతటి ఆనందం కాని, ఇంతటి భక్తిలో లీనమవడం కాని, ఇంతటి వైబ్రేషన్స్ కాని కలగలేదంటూ.. ఎన్నోచోట్ల యాంత్రికంగా చేశాము కాని ఇక్కడ బాబా అలా ప్రత్యక్షంగా మాముందు కూర్చున్నట్లుగా ఉందని, ఆ భావన తన ఒక్కరిదే కాదని, అందరూ ఆ భావనని అనుభవిస్తున్నారని ఆనందంతో చెప్పారు. వారి అనుభవం ఒక ఎత్తయితే, ఇంటి దగ్గర సత్సంగానికి సంబంధించి ఇద్దరు మహిళలు ఈ భజనకి రావడం చూడడం జరిగింది. ఇంకా ఆ ట్రాన్స్ నుండి రాలేకపోతున్నామని, పొద్దున మరల వారి సత్సంగ సభ్యులతో సహ ఒక 10 మంది దాకా.. మా ఇంటికి వచ్చి కాసేపు ధ్యానం చేసుకుని మరికాసేపు మాతో ముచ్చటించి వెళ్ళారు.

ఇక్కడ ఈ సంఘటన ద్వారా మాకర్థమయింది ఒకటే బాబా అదృశ్య శక్తి గురించి, అద్భుతాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నిజమైన భక్తులు వాటిని తెలుసుకోడానికి కాకపోయినా, వారి లీలలు కళ్ళార చూడడానికి వస్తారు. ఇలాంటి విషయాలు ఎంతోమంది భక్తులమని చెప్పుకునే కొంతమంది పెద్దమనుషులకి తెలియకపోవడం.. అసలు మొదలు, మూలాలు మర్చిపోయి ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాము.. అలాంటి వారి జోలికి సాయి భక్తులు వెళ్ళి అభాసుపాలు కాకండి. వారిని గమనించడం చాలా తేలిక..

వారి లక్షణాలు:

1. బాహ్య పటాటోపాలు ఎక్కువ
2. ఆడంబారాలు, అధిక ప్రసంగము..
3. సంసారం తృణప్రాయమని చెప్తూనే.. వారి కుటుంబం.  ఆ సభ్యుల గొప్పతనం అంటూ ఊదర గొట్టడం, ఇవన్నీ మాములుగా కలిస్తే కాదు సత్సంగాల నియమాలనుల్లంఘించి చెప్తూ ఉంటారు.
4. జిహ్వ చాపల్యానికి అతీతులమంటూనే రుచుల యుద్ధాలు చేయడం....
5. గాలి ఏటువైపు బాగా వీస్తే అటు మర్లి పోవడం..
6. వారిననుసరించి  బాహ్య పటాటోపాలు అత్యుత్సాహం చూపే మరికొందరు..
**********


 ఇక ట్రాన్స్ లోకి వెళ్ళి ఎంతో ఆనందంగా భజన చేస్తూ మళ్ళీ   మళ్ళీ వినాలనుకున్న,  ఆ సాయి కరుణ మనపై కురిపించే అతి మధురమైన ఆ పాట ఇక్కడ మీ కోసం.

బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోన ఈ మాట చెప్పాలయ్యా ..


బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోన ఈ మాట చెప్పాలయ్యా .

నీపాద సన్నిధిలో నాకు కాస్త చోటిస్తే...
నీ పాద సన్నిధిలో నాకు కాస్త చోటిస్తే..

జ్యోతినై వెలుగుతాను నీ మందిరానా ...
జ్యోతినై వెలుగుతాను నీ మందిరానా ..

బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోనా ఈ మాట చెప్పాలయ్యా .

ప్రతి నిముషం సమరముగా కాలమేమో కదులుతోంది
చిరుగాలుల తాకిడిలో ఆకులాగ రాలిపోగా

ప్రతి నిముషం సమరముగా కాలమేమో కదులుతోంది
చిరుగాలుల తాకిడిలో ఆకులాగ రాలిపోగా

స్వార్థమైన సమాజం వరదలాగా మారుతుంటే          
స్వార్థమైన సమాజం వరదలాగా మారుతుంటే                  బాబా.......

చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నావా
నీవు చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నావా ...


బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోన ఈ మాట చెప్పాలయ్యా .

అలలపైన సాగేటి మా ఆశల నౌకకి
దారేమో కానరాదు ఈ జీవన కడలిలో

అలలపైన సాగేటి మా ఆశల నౌకకి
దారేమో కానరాదు ఈ జీవన కడలిలో

సారధిగా వారధిగా తోడు నీడ నీవై
సారధిగా వారధిగా తోడు నీడ నీవై                   బాబా.......

నిన్నే నమ్ముకున్నాము మా సాయిబాబా
నిన్నే ... నమ్ముకున్నాము మా సాయి బాబా...

బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా
నా మదిలోన ఈ మాట చెప్పాలయ్యా....